17, జనవరి 2010, ఆదివారం

నా బజాజ్ స్పిరిట్



నా బజాజ్ స్పిరిట్. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలుగేళ్ళ క్రితం మా వారిని పీడించి సెకండ్ హాండ్ లో కొనుక్కున్నాను. బుజ్జిముండ నల్లగా ఎంత ముద్దొచ్ఛిందో. ఒక్క రోజులో డ్రైవింగ్ కూడ నేర్చుకున్నాను (ఈ లోపు నాలుగు సార్లు పడ్డాను లెండి). ఇంక మొదలైంది నా ప్రయాణం. ఫస్ట్ లో లారీలు బస్లు చూసి కొంచెం భయపడ్డాను కాని ఆ తర్వాత ఆఘమేఘాల (అదేనండి నా బండి) మీద వెళ్ళేదాన్ని. రెండు నెలలు హాపీగా గడిచిపోయాయి. ఆ తర్వాత మొదలైనయి నా జీవితంలో కష్టాలు. ఒక రోజు మా ఫ్రెండ్ ఫంక్షన్ కి పిలిచింది. పేద్ద ఫోజుగా బండేసుకుని బయలుదేరాను. అప్పుడు టైం 11.30 (అర్థ్రరాత్రి కాదులెండి పగలే). ఒక 15 నిమిషాలు ప్రయాణం చేసానో లేదో, బండి ఆగిపొయ్యింది. బండి అన్నాక ఎప్పుడో అప్పుడప్పుడు ఎక్కడో అక్కడ ఆగక తప్పదని ఆ నిమిషమే తెలిసింది. అటు ఇటు చూసాను ఎవరైనా చూస్తున్నారా అని (వెదవ ఇగో ఒకటి). ఎవరూ లేరు. పోని ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చూసాను. ప్చ్. కొంచెం దూరం నడిపించి స్టార్ట్ చేసాను. హమ్మయ్య స్టార్ట్ అయ్యింది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక (మీరు ఊహించిందే) మళ్ళీ ఆగిపొయ్యింది. మళ్ళీ అటు ఇటు.... మళ్ళీ కొంచెం దూరం ....మళ్ళీ స్టార్ట్ .....అలా అలా ఒక గంట తర్వాత ఒక మెకానిక్ షాప్ కనిపించింది. వాడు ఒక గంట పడుతుందన్నాడు. మా ఫ్రెండ్ ఇల్లు ఇంకా చాలా దూరం. ఏడుస్తూ మావారికి ఫోన్ చేసాను. తను వచ్చి నన్ను మా ఫ్రెండ్ ఇంటిదగ్గర దింపి దగ్గరుండి బండి బాగు చేయించారు. వచ్చేటప్పుదు మళ్ళీ అది డ్రైవ్ చేసుకుంటూ వచ్చెసాను. బుజ్జిముండ జామ్మ్ జామ్మ్ అని ఎంత బాగ వెళ్తుందో. ఒక వారం రోజులు బానే ఉంది. మళ్ళీ మొదలు. నేను ఆఫీసుకో ఇంకెక్కడకో వేసుకెళ్ళటం, అది మద్యలో ఆగిపోవటం, దాన్ని నేనక్కడే వదిలేసి వస్తే మా వారు దాన్ని రిపేర్ చేయించి తీసుకురావటం. ఇదంతా ఎందుకులే అని ఆయనే నన్ను డ్రాప్ చెయ్యటం పికప్ చేసుకోవటం చేసేవారు. అదేంటొ నేనెప్పుడు బండి వేసుకెళ్ళినా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆపేవాడు మరి నా ఫేస్ వాల్యూనో దాని ఫేస్ వాల్యూనో. ఎప్పుడైనా ఆఫీస్కి లేట్గా వెళ్తే మా బాస్ "ఎంటి మేడం బండి వేసుకుని వచ్చారా? పోనీ నడిచైనా రాకపోయారా?" అనేవాడు. ఆయనకి కూడా నా బండి అంటే అంత నమ్మకం. అలా అలా కాలక్రమంలో అది ఎలా తయారైందంటే హారన్ తప్ప అన్ని పార్ట్లు సౌండ్ వస్తయి. సో నేను హారన్ యూజ్ చెయ్యక్కరలేదు. బ్రేక్స్ పనిచెయ్యవు. హెడ్ లైట్ వెలగదు. ఒక మాదిరి స్పీడ్ బ్రేకర్ వచ్చినా దిగి తొయ్యాలి. వెనకాల ఎవరైనా ఎక్కితే బండంతా ఊగిపోతుంది. వాళ్ళు అప్పుడు దిగి నడిచి వస్తామంటారు. ఎప్పుడు చూస్తాడో ఏమో కరెక్ట్ గా నేను కిందకి దిగి బండి స్టార్ట్ చేసే టైంకి పాత సామాన్లు కొనేవాడు వచ్చేసి "పాత సామాన్లకి ఉల్లిపాయలు" అంటూ నా బండి వంక చూస్తూ అపార్ట్మెంట్ ముందు తిరుగుతూ వుంటాడు. అలా నాలుగుసార్లు చూసాను. దగ్గరికి పిలిచి "నా బండి ఎవరికైనా ఫ్రీగా అయినా ఇస్తా గాని నీకు అమ్మను" అని వార్నింగ్ ఇచ్చాను. ఎవరికైనా నా బండి ఇస్తే వాళ్ళు తిరిగొచ్చి "ఆ బండి ఎలా నడుపుతున్నారో గానీ మీరు చాలా గ్రేట్" అని నా వంక కొంచెం యడ్మైరింగ్గా, చాలా జాలిగా చూస్తారు. ఇంక నేను హైద్రాబాద్ వెళ్ళినప్పుదు దాన్ని పక్కన పడేసాను. మళ్ళీ విజయవాడ వచ్హాక కొంచెం రెపైర్ చేయించాను. మిగతా అంతా మామూలే కాని ఇప్పుడు అన్నిసార్లు అగిపోవట్లేదు. ఎప్పుడైనా పెట్రోల్ అయిపోయినప్పుడే. కాని పెట్రోల్ రోజూ అయిపోతుంది. ఇప్పుడు అది ఇంకొక కళ నేర్చుకుంది. పొద్దున్నే స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని బాగా పక్కకు వంచి స్టార్ట్ చేస్తే కాని స్టార్ట్ అవదు. మా మెకానిక్ కూడా ఇంక నా వల్ల కాదని చేతులెత్తేసాడు. ఇప్పుడైతే 2 మంత్స్ సాలరీ తో కొత్తది కొనుక్కోవచ్చు కాని నేనే కొంచెం సెంటీ అయిపొయాను. ఇంక ఫూచర్ లో కొనగలిగితే కార్ కొనుక్కుంటా గాని బైక్ మాత్రం ఇదే.